
యోగాను కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా మార్చాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి యోగాంధ్ర కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా యోగా గురువు బాబా రాందేవ్ రానున్నారు. శుక్రవారం విజయవాడ చేరుకోనున్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై యోగా ప్రచారం, ప్రజారోగ్య కార్యక్రమాలపై చర్చించనున్నారు. అనంతరం మంతెన ఆశ్రమంలో బస చేయనున్నారు.
ఉండవల్లి గుహల వద్ద యోగా సందడి
ఈ నెల 20న ఉండవల్లి గుహల వద్ద నిర్వహించే ప్రత్యేక యోగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, బాబా రాందేవ్ కలిసి పాల్గొననున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఉండవల్లి గుహల వేదికగా యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. కార్యక్రమం అనంతరం సీఎం చిలకలూరిపేట పర్యటనకు వెళ్లనున్నారు.
విజయవాడలో రాష్ట్రస్థాయి యోగా వేడుకలు
21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి యోగా వేడుకలు జరగనున్నాయి. ఐదు వేల నుంచి ఆరు వేల మంది ఒకేసారి యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ కళావేదికలో కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 33 వేల కేంద్రాల్లో యోగా డే నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కోటి మంది లక్ష్యంగా యోగాంధ్ర
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 2 లక్షల 60 వేల మందికి పైగా యోగా ట్రైనర్లను సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. యోగా డేలో పాల్గొనేందుకు కోటికి పైగా మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, పట్టణాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యోగా పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు.
ఇంటింటికీ యోగా…ప్రజారోగ్యానికి కొత్త దిశ
సంజీవని కార్యక్రమంతో యోగాను అనుసంధానం చేసి ప్రజారోగ్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక థెరప్యూటిక్ యోగా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. యోగాను ఏడాది పొడవునా కొనసాగించేలా “ఇంటింటికీ యోగా” పేరుతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. యోగా మాస్టర్ ట్రైనర్లకు వచ్చే ఏడాది ప్రత్యేక పురస్కారాలు అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…