Sreesanth, Bhuvneshwari Kumari Love Story: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంతో తన కెరీర్‌ను, జీవితాన్ని కోల్పోయిన భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ తన జీవితంలోని అత్యంత చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు. జైలు గోడల మధ్య నరకం చూశానని, ఆ సమయంలో తన భార్య భువనేశ్వరి అండగా నిలబడకపోతే తాను ప్రాణాలతో ఉండేవాడిని కానంటూ సంచలన విషయాలను పంచుకున్నారు.
జీవితాన్ని ముక్కలు చేసిన స్పాట్ ఫిక్సింగ్ వివాదం..
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన, దూకుడు గల బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్ కెరీర్ 2013 ఐపీఎల్ సీజన్‌తో ఒక్కసారిగా తలకిందులైంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా, బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. ఒక్క రాత్రిలోనే స్టార్ క్రికెటర్ స్థాయి నుంచి నిందితుడిగా మారిన ఆ క్షణాలు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని శ్రీశాంత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. జైలు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరణం అంచుల్లో బతికించిన ప్రేమ..
“నేను జైల్లో ఉన్నప్పుడు ప్రాణాలు వదిలేయాలని అనుకున్నాను, కానీ నన్ను బతికించింది నా భార్య భువనేశ్వరి మాత్రమే” అని శ్రీశాంత్ పేర్కొన్నారు. 2010లో తామిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని, 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలిస్తే పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాట ఇచ్చానని గుర్తుచేసుకున్నాడు. ఆ జైలు చీకటి గదుల్లో భువనేశ్వరి ప్రేమ, ఆమెకు ఇచ్చిన మాటే తనను బతికేలా చేశాయని కన్నీటిపర్యంతమయ్యారు. బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాతే తమ నిశ్చితార్థం (రోకా) జరిగిందని శ్రీశాంత్ చెప్పాడు.
అంగవైకల్యం ముప్పు ఉన్నా వదలని బంధం..
ఫిక్సింగ్ వివాదానికి ముందే 2012లో శ్రీశాంత్ తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నాడు. ‘బోన్ మారో ఎడెమా’ కారణంగా ఆయన కాలి వేలికి శస్త్రచికిత్స జరిగింది. ఆ సమయంలో ఆయన దాదాపు 17 శాతం అంగవైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. తాను మళ్లీ నడవగలనా, క్రికెట్ ఆడగలనా అనే నమ్మకం లేకపోవడంతో భువనేశ్వరి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి, పెళ్లి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవద్దని కోరారు. కానీ, శ్రీశాంత్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తమ కూతురిని ఆయనకే ఇచ్చి పెళ్లి చేయడానికి భువనేశ్వరి కుటుంబం సిద్ధపడింది.
వివాదాల నుంచి పునరాగమనం వరకు..
టీమిండియా గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో శ్రీశాంత్ కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో బీసీసీఐ ఆయనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించింది. నిషేధం ముగిసిన తర్వాత కేరళ జట్టు తరపున దేశీవాళీ క్రికెట్లోకి పునరాగమనం చేసిన శ్రీశాంత్, చివరకు 2022 మార్చిలో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..