సినిమా పరిశ్రమలో ఒక విజయవంతమైన నటుడిగా, నిర్మాతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మురళీ మోహన్ స్థిరపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఎంతోమంది సినీ ప్రముఖులు తమ కెరీర్లో తప్పులు చేసి, ఆర్థికంగా ఎలా దెబ్బతిన్నారో వివరించారు. విజయాలు సాధించినప్పటికీ, సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల చాలామంది చివరికి ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పుకోచ్చారు. మురళీ మోహన్ దృష్టిలో, సినిమా పరిశ్రమలో విజయానికి కేవలం నటనా ప్రతిభ మాత్రమే సరిపోదు. ఆర్థిక నిర్వహణ, పెట్టుబడుల పట్ల అవగాహన అత్యవసరం. కాంతారావు, హరనాథ్, రాజబాబు, పద్మనాభం వంటి ప్రముఖ నటులు తమ స్వయంకృతాపరాధాల వల్లనే ఆర్థికంగా దెబ్బతిన్నారని చెప్పుకొచ్చారు. కాంతారావు వంటి వారు హీరోగా ఎన్నో సినిమాలు చేసినా, నిర్మాతగా మారినప్పుడు సరైన బడ్జెట్ నిర్వహణ లేకపోవడం వల్ల చివరికి డబ్బులు లేకుండా పోయారని ఆయన గుర్తు చేశారు. రజినీకాంత్ లాంటి వారు సహాయం చేయాల్సి వచ్చిందని కూడా పేర్కొన్నారు. అలాగే, రాజబాబు స్వంత సినిమాలు తీయడం మొదలుపెట్టి హీరో క్యారెక్టర్లు వేసుకోవడం, తన పరిమితులు దాటి పెద్ద డైలాగులు చెప్పడానికి ప్రయత్నించడం వల్ల కూడా విజయం సాధించలేకపోయారని తెలిపారు. పద్మనాభం కూడా అద్భుతమైన కెరీర్ కలిగి ఉన్నప్పటికీ, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల చివరికి కష్టాలు పడ్డారని మురళీ మోహన్ వివరించారు.
సినిమా సక్సెస్ అనేది తమ చేతుల్లో ఉండదని, అది ప్రేక్షకుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని మురళీ మోహన్ బలంగా నమ్ముతారు. కాబట్టి, సినిమా నిర్మాణంలో ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి అనే లెక్కలు స్పష్టంగా ఉండాలని ఆయన చెప్పారు. ఈ విషయంలో తన సోదరుడు కిషోర్ పాత్రను ఆయన ప్రశంసించారు. కిషోర్ ప్రొడక్షన్ సైడ్లో ఎక్కడా రూపాయి కూడా వృథా కాకుండా చూసుకునేవాడని, స్క్రిప్ట్ నిర్వహణ, బడ్జెట్ కేటాయింపు, నటీనటుల ఎంపికలో కఠినమైన నియమాలను పాటించేవాడని మురళీ మోహన్ తెలిపారు. కిషోర్ “పాపాల భైరవుడు” అని పిలవబడేంత కఠినంగా ఉండేవాడని, కానీ ఈ కఠినత్వం వల్లే తాము ఆర్థికంగా సురక్షితంగా ఉండగలిగామని ఆయన అన్నారు. ఆర్టిస్టుల ఎంపికలో కూడా, ఒక పాత్రకు ముగ్గురు నటీనటుల పేర్లను సూచించి, వారి రెమ్యునరేషన్ ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారని, అనవసరమైన ఖర్చులను తగ్గించుకునేవారని వివరించారు.
మురళీ మోహన్ తన కెరీర్ ప్రారంభంలో సావిత్రి, కాంతారావు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసిన అనుభవాలను కూడా పంచుకున్నారు. “భారతంలో ఒక అమ్మాయి” అనే దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో కాంతారావు తన తండ్రి పాత్రలో, సావిత్రి తల్లి పాత్రలో నటించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవాలు కూడా తమకు ఎన్నో పాఠాలను నేర్పాయని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. సినిమా మొదలు పెట్టిన తేదీ నుంచి 100 రోజుల్లో సినిమాను విడుదల చేసేలా బడ్జెట్ను పక్కాగా ప్లాన్ చేసుకునేవారమని, ఇందులో కిషోర్ పాత్ర గణనీయమని ఆయన తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..