Headlines

Failed Captains: పరుగుల్లో తోపులు.. కెప్టెన్లుగా అట్టర్ ఫ్లాప్.. టాప్ 5 లిస్ట్‌లో ఫస్ట్ పేరు చూస్తే ఔరా అనాల్సిందే..?

Failed Captains: పరుగుల్లో తోపులు.. కెప్టెన్లుగా అట్టర్ ఫ్లాప్.. టాప్ 5 లిస్ట్‌లో ఫస్ట్ పేరు చూస్తే ఔరా అనాల్సిందే..?


Legendary Batsmen Failed Captains: క్రికెట్ ప్రపంచంలో కొందరు ఆటగాళ్లు మైదానంలోకి దిగితే పరుగుల వరద పారాల్సిందే. బ్యాట్‌తో వారు సృష్టించే విశ్వరూప రికార్డులు చూసి అభిమానులు మురిసిపోతుంటారు. కానీ, అదే ఆటగాళ్లకు జట్టు బాధ్యతలు అప్పగిస్తే మాత్రం కథ అడ్డం తిరుగుతుంది. అద్భుతమైన బ్యాటర్లుగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కెప్టెన్లుగా ఘోరంగా విఫలమైన ఐదుగురు ప్రపంచ స్థాయి దిగ్గజ క్రికెటర్ల గురించిన ఆసక్తికర కథనం మీకోసం.

నాయకత్వ భారంతో కుంగిపోయిన క్రికెట్ దేవుడు..

ఈ జాబితాలో అందరినీ కలిచివేసే పేరు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. బ్యాటింగ్‌లో వంద శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన సచిన్, కెప్టెన్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆయన సారథ్యంలో భారత్ ఆడిన 98 మ్యాచ్‌లలో కేవలం 27 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 52 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. సచిన్ నాయకత్వ విజయాల శాతం కేవలం 27.55 మాత్రమే కావడంతో, తీవ్ర ఒత్తిడి కారణంగా ఆయన స్వయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత ప్రతిభ ఎంత ఉన్నా జట్టును నడిపించడంలో అదృష్టం, వ్యూహాలు కలిసిరాలేదని సచిన్ కెరీర్ చూస్తే అర్థమవుతుంది.

పరుగుల వీరుడు.. సారథ్యంలో బేజారు..!

ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా పేరొందిన జో రూట్ మూడు ఫార్మాట్లలో కలిపి 22,545 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అలిస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజాల కంటే రూట్ రికార్డుల పరంగా ఎంతో ముందున్నాడు. అయితే ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన 65 మ్యాచ్‌లలో కేవలం 27 విజయాలు మాత్రమే అందించగలిగాడు. ఆయన విజయాల శాతం 41.53 మాత్రమే. ఇయాన్ మోర్గాన్ లాంటి విజయవంతమైన కెప్టెన్లతో పోలిస్తే రూట్ వ్యూహాలు మైదానంలో పారలేదనే చెప్పాలి. ముఖ్యంగా యాషెస్ సిరీస్‌లలో వరుస ఓటములు ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.

మిస్టర్ 360 డిగ్రీస్.. ఐసీసీ ట్రోఫీ కలగానే..

దక్షిణాఫ్రికా క్రికెట్ సంచలనం ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 19,864 పరుగులతో ఆ దేశ రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. డివిలియర్స్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టేది. కానీ కెప్టెన్‌గా తన జట్టుకున్న ‘చోకర్స్’ అనే అపవాదును ఆయన చెరిపేయలేకపోయారు. అత్యంత బలమైన జట్టు ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాకు ఒక్క పెద్ద ఐసీసీ ట్రోఫీని కూడా అందించలేకపోయాడు. 124 మ్యాచ్‌లలో 69 విజయాలు సాధించినా, ప్రపంచకప్ లాంటి కీలక సమయాల్లో జట్టును ఒడ్డుకు చేర్చడంలో విఫలమయ్యాడు. 2015 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి ఆయన కెరీర్‌లో ఒక తీరని వేదనగా మిగిలిపోయింది.

కీలక సమయాల్లో బోల్తా పడిన బాబర్ ఆజం..

పాకిస్తాన్ రికార్డుల రారాజు బాబర్ ఆజం కేవలం 31 ఏళ్ల వయసులోనే 15,703 పరుగులు సాధించి ఆ దేశ ఐదో అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. భవిష్యత్తులో నంబర్ వన్ స్థానానికి చేరుకునే సత్తా ఉన్నా, కెప్టెన్‌గా మాత్రం విమర్శల పాలయ్యాడు. ఇమ్రాన్ ఖాన్, మిస్బా ఉల్ హక్ తర్వాత పాకిస్తాన్‌కు ఎక్కువ మ్యాచ్‌లలో సారథ్యం వహించిన బాబర్, 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై చేతులెత్తేసి సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. 148 మ్యాచ్‌లలో 84 విజయాలు సాధించినప్పటికీ, బలహీనమైన జట్లపై గెలిచి పెద్ద టోర్నీలలో కెప్టెన్‌గా తడబడ్డాడనే ముద్రను ఆయన చెరిపేసుకోలేకపోయాడు.

న్యూజిలాండ్ సుదీర్ఘ సారథి.. కానీ రికార్డులు పేలవం..!

కివీస్ జట్టుకు అత్యధిక కాలం కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత స్టీఫెన్ ఫ్లెమింగ్‌ది. 15,289 పరుగులతో రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ ఆయనే. అయితే 303 మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించిన ఫ్లెమింగ్, ఏకంగా 135 ఓటములను చవిచూశాడు. ఆయన విజయాల శాతం కేవలం 42.24 మాత్రమే. 2000 సంవత్సరంలో భారత్‌పై ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలవడం మినహా, సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా కొనసాగినప్పటికీ ఫ్లెమింగ్ కివీస్ జట్టును ప్రపంచ విజేతగా నిలబెట్టలేకపోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *