సాధారణంగా బజ్జీలకు ఉపయోగించే మిరపకాయలతో నిల్వ పచ్చడి కూడా చేయవచ్చు. “పచ్చి మిరపకాయ ఆవకాయ” అని పిలువబడే ఈ పచ్చడి రుచిలో అమోఘంగా ఉంటుంది. ఇది కారంగా ఉంటుందేమో అని చాలా మంది భయపడవచ్చు, కానీ అసలు కారం ఉండకుండా, పైగా కరకరలాడుతూ ఉండేలా ఈ పచ్చడిని తయారుచేస్తారు. ఈ పచ్చడిని ఎప్పుడైనా, సీజన్‌తో సంబంధం లేకుండా తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఒక్క మిరపకాయ వేసుకుని కొరుక్కుంటూ, ఊటతో కలిపి తింటే రుచి అమోఘంగా ఉంటుందని చెబుతున్నారు.
కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం:
1. మిరపకాయల ఎంపిక, శుభ్రపరచడం: ఈ ఆవకాయ కోసం పావు కిలో బజ్జీ మిరపకాయలను తీసుకోవాలి. కాయలు ఫ్రెష్‌గా, గట్టిగా ఉండాలి. వాటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి, అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. పగుళ్లు ఉన్న కాయలను తీసుకోకూడదు, ఎందుకంటే కడిగినప్పుడు వాటిలోకి నీళ్లు చేరతాయి. పచ్చడి పాడవకుండా ఉండాలంటే మిరపకాయలు పూర్తిగా ఆరిన తర్వాతనే పచ్చడి పట్టాలి.
2. మిరపకాయలను కోయడం, గింజలు తీయడం: బాగా ఆరిన మిరపకాయలను కత్తితో నిలువుగా కట్ చేసి, మధ్యలో ఉన్న గింజలను నిదానంగా తీసేయాలి. తొడిమలు ఫ్రెష్‌గా ఉంటే ఉంచేసుకోవచ్చు, లేదంటే తీసేయాలి. అన్ని కాయలను ఇలాగే చేసి, ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకోవాలి.
3. నిమ్మరసం పట్టించడం: పావు కిలో మిరపకాయలకు మూడు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకుని, శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి రసం తీసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని గింజలు తీసిన మిరపకాయలపై వేసి బాగా కలపాలి. నిమ్మరసం మిరపకాయలోని కారాన్ని తగ్గించడమే కాకుండా, సహజ ప్రిజర్వేటివ్‌గా పనిచేసి పచ్చడి పాడవకుండా నిల్వ ఉంచుతుంది. ఇలా నిమ్మరసం పట్టించి 15 నిమిషాల పాటు నాననివ్వాలి.
4. మసాలా పొడి తయారీ: స్టవ్ మీద పాన్ పెట్టి, ఒక టేబుల్‌స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్‌లో ఎర్రగా వేయించాలి. అవి మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత రెండు టేబుల్స్పూన్ల ఆవాలు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
5. పచ్చడి కలపడం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో అర కప్పు కారం, పావు కప్పు ఉప్పు (కొద్దిగా పక్కన పెట్టుకుని, రుచి చూసి తర్వాత కలుపుకోవచ్చు), వేయించి పొడి చేసిన ఆవాలు, మెంతి పొడి, 30 నుంచి 40 వెల్లుల్లి రెబ్బలు (పొట్టు తీసి), ఒక కప్పు పచ్చి పల్లి నూనె వేసుకోవాలి. పచ్చడికి పచ్చి పల్లి నూనెనే మంచి రుచిని ఇస్తుంది. పచ్చి నూనె ఇష్టం లేని వారు నూనెను కాచి పూర్తిగా చల్లారిన తర్వాత వాడుకోవచ్చు. ఈ పదార్థాలన్నీ బాగా కలిసేలా చేతితో కలుపుకోవాలి.
6. పచ్చడిని ఊరబెట్టడం: నిమ్మరసంలో నానబెట్టిన మిరపకాయలను, ఆ నిమ్మరసాన్ని కూడా ఈ మసాలా మిశ్రమంలో వేసి చేతితో బాగా కలపాలి. స్పూన్‌తో కలిపితే సరిగా కలవదు. పచ్చడిని కలిపిన తర్వాత చేతులను సోప్‌తో కడగకుండా మామూలు నీళ్లతో కడిగి, రెండు చుక్కల కొబ్బరి నూనె రాసుకుంటే మంట తగ్గతుంది. ఇలా బాగా కలిపిన పచ్చడిని లోపలికి నొక్కి పెట్టి మూత పెట్టి 24 గంటల పాటు అంటే ఒక రోజంతా బాగా ఊరనివ్వాలి.
7. చివరి మెరుగులు, నిల్వ: మరుసటి రోజు పచ్చడి బాగా ఊరి, నూనె పైకి తేలుతుంది. ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. గ్రేవీ అడుగున ముద్దలా ఉంటే, అదంతా నూనెతో బాగా కలిసేలా చూసుకోవాలి. పచ్చడి కలిపిన తర్వాత రుచి చూసి, అవసరమైతే ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మళ్లీ ఒక రోజు పాటు ఊరనిచ్చి, తర్వాత గ్లాస్ బాటిల్స్‌లో కానీ జాడీలోకి కానీ తీసేసుకోవాలి. పచ్చడిపై నూనె తేలుతూ ఉండేలా చూసుకోవాలి. పచ్చడి తీయడానికి వాడే స్పూన్స్ తడి లేకుండా ఉంటే, ఈ పచ్చడి బయట 2-3 నెలలు, ఫ్రిజ్‌లో 6 నెలల పైగా నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి లేకుండానే ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది.
Also Read: ఒకే ఒక వారంలో కొత్తిమీర గుబురు, గుబురుగా పెంచే టెక్నిక్ మీ కోసం..