హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ వివాహిత చేసిన ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీఐని బదిలీ చేశారు. బాధితురాలి ఆరోపణలపై డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఉన్నతస్థాయి విచారణ ప్రారంభమైంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాను ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో సీఐ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. అంతేకాకుండా ఆ ఘటనను వీడియోగా చిత్రీకరించి, వాటిని అడ్డం పెట్టుకుని పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. బెదిరింపులతో పాటు తన నుంచి దాదాపు రూ.2 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడని, అందుకు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీల ఆధారాలను కూడా డీజీపీకి సమర్పించినట్లు ఫిర్యాదులో వెల్లడించింది.
సీఐ కారణంగా తాను గర్భం దాల్చగా బలవంతంగా అబార్షన్ చేయించాడని, ఆస్పత్రి రికార్డుల్లో తన ఫోన్ నంబర్ నమోదు చేయించినట్లు కూడా బాధితురాలు పేర్కొంది. అలాగే హైదరాబాద్ పోస్టింగ్ కోసం సీఐ రూ.25 లక్షలు ఖర్చు పెట్టుకున్నట్లు తనతో చెప్పాడని ఫిర్యాదులో ఆరోపించింది.
తాను నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా, సిబ్బంది అడ్డుకున్నారని కూడా బాధితురాలు ఆరోపించింది. దీంతో నేరుగా డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆశ్రయించి రాతపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన డీజీపీ.. విచారణ బాధ్యతలను మల్టీజోన్ ఐజీ షానవాజ్ ఖాసీంకు అప్పగించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని వెస్ట్ జోన్ డీసీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వివాహిత చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ కొనసాగుతోందని వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..