Headlines

పెట్రోల్ ధరల షాక్‌తో ఈవీలకు భారీ డిమాండ్.. భారత్‌లో రికార్డు స్థాయికి EV అమ్మకాలు!

పెట్రోల్ ధరల షాక్‌తో ఈవీలకు భారీ డిమాండ్.. భారత్‌లో రికార్డు స్థాయికి EV అమ్మకాలు!


భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), హైబ్రిడ్ కార్ల కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, పశ్చిమాసియా (వెస్ట్ ఆసియా) యుద్ధం నేపథ్యంలో ఇంధన వ్యయంపై ఆందోళనలు అధికమవడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. జూన్ నెలలో ఆటోమొబైల్ రంగంలో మొత్తం రిటైల్ అమ్మకాలు 22 శాతం పెరిగాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), హైబ్రిడ్ కార్లు, సీఎన్‌జీ (CNG) వాహనాలు కలిపి మొత్తం ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలలో 40 శాతానికి పైగా వాటా నమోదు చేశాయి. మే నెలలో ఇది సుమారు 38 శాతంగా ఉండగా, జూన్‌లో మరింత పెరిగింది.

సీఎన్‌జీ ముందంజ.. ఈవీల వాటా కూడా పెరుగుదల

జూన్ నెలలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల అమ్మకాలలో సీఎన్‌జీ వాహనాల వాటా 24.3 శాతం కాగా, హైబ్రిడ్ వాహనాలు 8.3 శాతం, ఎలక్ట్రిక్ వాహనాలు 7.8 శాతం వాటా సాధించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో తక్కువ నిర్వహణ వ్యయం కలిగిన వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) గణాంకాల ప్రకారం, జూన్‌లో నమోదైన మొత్తం ఈవీ అమ్మకాలలో సుమారు 63 శాతం టూ వీలర్ వాహనాలే కాగా, నాలుగు చక్రాల(ఫోర్ వీలర్) ఈవీల వాటా కేవలం 10 శాతం మాత్రమే.

నిర్వహణ ఖర్చులు తక్కువ.. ప్రభుత్వ రాయితీలు కూడా ఆకర్షణ

ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీలు ఇవ్వడం కూడా ఈవీలకు డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. హైబ్రిడ్ వాహనాలు కూడా పర్యావరణహితమైన ఎంపిక అయినప్పటికీ, అధిక పన్నులు, పరిమిత ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా వాటి అమ్మకాలు ఈవీలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈవీలపై కేవలం 5 శాతం జీఎస్‌టీయే ఉండగా, హైబ్రిడ్ వాహనాలపై 40-48 శాతం వరకు పన్నులు విధిస్తున్నారు.

పెట్రోల్ ధరలే ప్రధాన కారణం

వెస్ట్ ఆసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.7 నుంచి రూ.11 వరకు పెరిగాయి. దీంతో ప్రారంభ కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఇంధన వ్యయం తగ్గడం వల్ల ఈవీలు మరింత ఆదా కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌క్రెడ్ క్యాపిటల్ విశ్లేషకుడు రవి గుప్తా మాట్లాడుతూ, “ప్రస్తుతం ఛార్జింగ్ మౌలిక వసతుల కొరత పెద్ద సమస్య కాదు. చాలా మంది ఇంట్లోనే వాహనాలను ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. నగరాల్లో పరిమిత దూర ప్రయాణాలకు ఈవీలు అనువుగా ఉండటంతో వినియోగదారులు వీటిని ఎంచుకుంటున్నారు” అని తెలిపారు.

టూ వీలర్ ఈవీల్లో భారీ వృద్ధి

నొమురా నివేదిక ప్రకారం, ప్యాసింజర్ వాహనాల్లో ఈవీల వాటా మార్చి త్రైమాసికం చివరినాటికి 4 శాతం ఉండగా, జూన్ నాటికి అది 7.5 శాతానికి పెరిగింది. టాటా మోటార్స్ జూన్‌లో అత్యధికంగా దాదాపు 15 వేల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 183 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల వృద్ధి 67 శాతంగా నమోదైంది. టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి సంస్థలు ఈ ఏడాది కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురాగా, మరిన్ని మోడళ్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

టూ వీలర్ వాహనాల్లో కూడా ఈవీల వాటా గత ఆర్థిక సంవత్సరం చివరినాటి 7.7 శాతం నుంచి జూన్‌లో 10.6 శాతానికి చేరింది. బజాజ్ ఆటో ఈవీ విక్రయాలు 70 శాతం పెరగగా, టీవీఎస్ మోటార్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వ్యాపారం తొలి త్రైమాసికంలో 86 శాతం వృద్ధిని నమోదు చేసింది.

తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్న కంపెనీలు

పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటో కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి. బజాజ్ ఆటో తన చేతక్ ఈవీ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 వేల నుంచి 60 వేల యూనిట్లకు పెంచనుంది. టీవీఎస్ మోటార్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని నెలకు 40 వేల నుంచి 50 వేల యూనిట్లకు, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల( త్రీ వీలర్) సామర్థ్యాన్ని 20 వేల నుంచి 30 వేల యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది.

మెరుగవుతున్న ఛార్జింగ్ మౌలిక వసతులు

దేశంలో ప్రస్తుతం 52,718 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా, వాటిలో 16,561 ఫాస్ట్ ఛార్జర్లు కార్ల కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఒక్కో పబ్లిక్ ఛార్జర్‌కు సగటున 235 ఈవీలు ఉండగా, ప్రపంచ సగటు 6 నుంచి 20 ఈవీల మధ్య ఉంది. అయినప్పటికీ మెట్రో నగరాలు, రెండో శ్రేణి నగరాలు, జాతీయ రహదారుల వెంట ఛార్జింగ్ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా కీలకం

2015లో ప్రారంభించిన FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) పథకం, 2024లో ప్రవేశపెట్టిన PM E-Drive పథకం ద్వారా ప్రభుత్వం ఈవీ కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలాగే తయారీ, ఛార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తోంది. సెంటర్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) అధ్యయనం ప్రకారం, వ్యక్తిగత వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్లను ఐదు నుంచి ఎనిమిదేళ్లపాటు ఉపయోగిస్తే సుమారు 20 శాతం వరకు ఆదా చేయగలుగుతారు. ఫ్లీట్ ఆపరేటర్లకు ఈ ఆదా 35-40 శాతం వరకు ఉండొచ్చని అంచనా.

బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా వినియోగదారులు ఆపరేటింగ్ ఖర్చులను తగ్గించే ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ శైలేష్ చంద్ర కూడా ఇటీవల మాట్లాడుతూ, వెస్ట్ ఆసియా సంక్షోభం తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల విశ్వాసం, ఆసక్తి మరింత పెరిగిందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే, పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నిర్వహణ ఖర్చులలో ఆదా, కొత్త మోడళ్ల అందుబాటు వంటి అంశాలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను వేగంగా విస్తరింపజేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *