భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రెండు దశాబ్దాల్లో భారీగా విస్తరించే అవకాశం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. సెప్టెంబర్ 19న ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం సుమారు 4.015 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత GDP వచ్చే 20 ఏళ్లలో 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొన్నారు.
భారత్ ప్రస్తుతం కీలకమైన పరివర్తన దశలో ఉందని అజిత్ దోవల్ చెప్పారు. 2047 వరకు ఉన్న కాలాన్ని ‘అమృత్ కాల్’గా పేర్కొంటూ.. దేశంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, భవిష్యత్తులో యువతకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇలాంటి మార్పుల సమయంలో విద్యను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంతో పాటు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
ధైర్యంగా ముందుకు వెళ్లాలిః దోవల్
విద్యార్థులు తమ జీవితంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని అజిత్ దోవల్ సూచించారు. ఇందుకు శ్రీరాముడి ఉదాహరణను ప్రస్తావించారు. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కారణంగానే విశ్వామిత్రుడు శ్రీరాముడిని ఎంచుకున్నారని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచిస్తూ, కొత్త అవకాశాలను స్వీకరించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తన కెరీర్ తొలినాళ్లలో సిక్కింలో పనిచేసిన సమయంలో ఓ షెర్పా నుంచి నేర్చుకున్న మూడు విషయాలను కూడా దోవల్ విద్యార్థులతో పంచుకున్నారు.
షెర్పా చెప్పిన మూడు విజయ సూత్రాలు:
మొదటిది.. మ్యాప్‌లో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడం.
రెండోది.. మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో స్పష్టంగా నిర్ణయించుకోవడం.
మూడోది.. గమ్యాన్ని చేరేందుకు సరైన మార్గాన్ని తెలుసుకోవడంతో పాటు, అవసరమైతే తిరిగి వచ్చే మార్గాన్ని కూడా తెలుసుకోవడం.
లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుత పరిస్థితిపై అవగాహన, స్పష్టమైన గమ్యం, సరైన ప్రణాళిక అవసరమని ఈ మూడు సూత్రాలు సూచిస్తున్నాయని అజిత్ దోవల్ వివరించారు. ఐఐటీ రూర్కీ 2026 స్నాతకోత్సవం సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరుగుతోంది. రెండు రోజుల కార్యక్రమంలో మొత్తం 2,701 మంది విద్యార్థులు డిగ్రీలు అందజేస్తున్నారు. ఈ పట్టభద్రులలో 1,001 మంది పురుష విద్యార్థులు మరియు 276 మంది మహిళా విద్యార్థులు ఉన్నారు. ఇది సంస్థ చరిత్రలో ఒకే స్నాతకోత్సవంలో అత్యధిక సంఖ్య. ఈ కార్యక్రమానికి అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ , సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శి జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి గౌరవ అతిథిగా విచ్చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..