Headlines

BRICS Summit 2026: గ్రాండ్‌ సక్సెస్‌.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌తో ట్రంప్‌కు ప్రధాని మోదీ బలమైన సందేశం..


భారత్‌ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన బ్రిక్స్‌ సదస్సు గ్రాండ్‌గా ముగిసింది. అనుకున్న దానికంటే గ్రాండ్ సక్సెస్సయ్యి… ప్రపంచానికి ఓ గట్టి సందేశాన్ని పంపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటంలో పెద్దన్న పాత్ర పోషించిన భారత్… ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమతుల్యాన్ని సాధించాలనే ప్రయత్నంలో దీన్నో ఉపయోగకర వేదికగా మారింది. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి కళ్ళెం వేసేలా బ్రిక్స్ సదస్సుకు ప్రపంచ కీలకనేతలను రప్పించడంలో సఫలమైంది. న్యూఢిల్లీ డిక్లరేషన్తో వైట్ హౌజ్ కు బలమైన సందేశాన్ని పంపింది. ​అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల కోసం గళం విప్పిన బ్రిక్స్ దేశాలు.. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించే దిశగా మరింత బలంగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. ​ సరిహద్దు ఉగ్రవాదం, మనీలాండరింగ్, సైబర్ భద్రత, ప్రాంతీయ భద్రత అంశాలపై సభ్య దేశాల మధ్య సమాచార మార్పిడి, ఉమ్మడి వ్యూహాల రూపకల్పనకు కలిసి పనిచేయాలని బ్రిక్స్‌ వేదిక నిర్ణయించింది.

ఇది కూటమి కాదు.. పరిష్కారాల వ్యవస్థన్న మోదీ

బ్రిక్స్‌ అంటే కేవలం దేశాల కూటమి కాదు… పరిష్కారాల వ్యవస్థన్నారు ప్రధాని మోదీ. బ్రిక్స్ సదస్సు ముగింపు వేదికపై మాట్లాడిన ఆయన… ఈ రెండు రోజుల చర్చలతో సభ్యదేశాల ఉమ్మడి సహకారంపై నమ్మకం మరింత బలపడిందన్నారు. న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ఉమ్మడి దార్శనికత, భవిష్యత్‌ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని అభిప్రాయపడ్డారు. 18వ బ్రిక్స్‌ సదస్సు ముగింపు సందర్భంగా ఇందులో పాల్గొన్న దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌

ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌… మోదీతో ప్రత్యేకంగా సమావేశం కావడం ఈ సదస్సులో కీలక పరిణామం. BRICS కూటమి మరింత బలోపేతం కావాలన్నదే చైనా అభిమతమన్న జిన్‌పింగ్‌… డిజిటల్ స్కిల్స్ శిక్షణకు మద్దతునిస్తామన్నారు. సభ్య దేశాల్లో స్మార్ట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సహకారం ఇస్తాన్న జిన్‌పింగ్‌.. BRICS ఇంజినీర్ల అభివృద్ధి కూటమి ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. యువ శాస్త్ర-సాంకేతిక ప్రతిభకు BRICS ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచంతో అభివృద్ధి అవకాశాలు పంచుకుంటామన్న ఆయన… బలం ఉంటేనే న్యాయం దక్కుతుందనే భావనను విడిచిపెట్టాలని స్పష్టం చేశారు.

ప్రపంచ దేశాలన్నీ సమానమేనన్న సంకేతం

మొత్తంగా ప్రపంచ దేశాలన్నీ సమానమేనన్న బలమైన సందేశాన్ని… అగ్ర రాజ్యం అమెరికాకి పంపించాయి బ్రిక్స్‌ దేశాలు. న్యూఢిల్లీ డిక్లరేషన్‌ని ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ దేశాలను ఏకతాటిపైకి తెచ్చి… ట్రంప్‌కి మోదీ గట్టి హెచ్చరికలే పంపించారు. సదస్సు ముగింపు వేళ.. పలుదేశాల అధినేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు మోదీ. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆదిపత్యాన్ని చెలాయిస్తే సహించేది లేదన్న అభిప్రాయాన్ని ఈ వేదికపై గట్టిగానే వినిపించాయి బ్రిక్స్ దేశాలు. బాహ్య ఒత్తిళ్లను సమిష్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముందున్న చైనా,రష్యా,భారత్ దేశాల అధినేతలు… ఏకతాటిపైకి రావడం ఇప్పుడు గ్లోబల్‌గా చర్చనీయాంశమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *