Asia Cup 2026: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్ పోరులో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన సుల్తానాపై కెప్టెన్సీ వేటు వేయడానికి బోర్డు సిద్ధమవుతోంది. గత గురువారం జరిగిన మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌పై భారత జట్టు 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పదోసారి ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్ ఆరంభంలో టాస్ సమయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా పక్కకు తప్పుకోవడం కలకలం రేపింది. సాధారణంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా నో హ్యాండ్‌షేక్ విధానం కనిపిస్తుంటుంది. అయితే బంగ్లాదేశ్ కెప్టెన్ కూడా అదే తరహాలో ప్రవర్తించడం పట్ల క్రికెట్ ప్రపంచంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది.
చేతులు దులుపుకున్న బీసీబీ
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. కెప్టెన్ నిగర్ సుల్తానా చేసిన పనితో బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. బీసీబీ విమెన్స్ కమిటీ ఛైర్మన్ రఫికుల్ ఇస్లామ్ బాబు ఈ విషయంపై ప్రకటన విడుదల చేశారు. హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం పూర్తిగా సుల్తానా సొంత నిర్ణయమని, క్రీడలు ప్రపంచ దేశాలను ఒకటి చేయడానికి ఉద్దేశించినవని చెప్పారు. భారత్‌తో సహా అన్ని దేశాలతో బంగ్లాదేశ్ సత్సంబంధాలను కోరుకుంటుందని స్పష్టం చేశారు.
ఏషియన్ గేమ్స్ తర్వాత నిర్ణయం
మైదానంలో ప్రదర్శించిన అనుచిత వైఖరి సుల్తానా కెరీర్‌కే ముప్పుగా మారింది. ఆమె ప్రవర్తనపై బోర్డుకు ఫిర్యాదులు అందడంతో బిసిబి కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జరగబోయే ఏషియన్ గేమ్స్ పోటీలు పూర్తయిన వెంటనే జట్టు ప్రదర్శనను సమీక్షించి సుల్తానా కప్టెన్సీ మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటామని రఫికుల్ ఇస్లామ్ వెల్లడించారు. మైదానంలో స్పోర్ట్స్ మ్యాన్‌షిప్ విస్మరించినందుకు ఆమె మూల్యం చెల్లించుకోక తప్పదని సంకేతాలు ఇచ్చారు.
ఫైనల్ బెర్త్ వివరాలు
వివాదాల నడుమ సాగిన ఈ సెమీఫైనల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 20 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. 40 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 13 ఆదివారం శ్రీలంకతో జరగనున్న ఫైనల్ పోరులో భారత జట్టు ట్రోఫీ కోసం తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..