Headlines

CWG 2026 : కామన్వెల్త్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు.. అయినా ర్యాంకింగ్‌లో షాక్

CWG 2026  : కామన్వెల్త్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు.. అయినా ర్యాంకింగ్‌లో షాక్


CWG 2026 : స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‎లో 8వ రోజు భారత అథ్లెట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. గురువారం జరిగిన వివిధ పోటీల్లో భారత క్రీడాకారులు మొత్తం రెండు పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో మొదటి పతకం వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రాగా, రెండో పతకం మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో లభించింది. ఈ రెండు పతకాలతో భారత్ క్రీడాభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపినప్పటికీ, పతకాల పట్టికలో మాత్రం భారత్ స్థానం స్వల్పంగా దిగజారడం గమనార్హం.

వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించిన లవ్‌ప్రీత్ సింగ్

గురువారం ఆటలో భారత్‌కు తొలి పతకాన్ని వెయిట్‌లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ అందించాడు. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆయన అద్భుత ప్రదర్శన చేస్తూ మొత్తం 388 కిలోల బరువును ఎత్తి రజత పతకాన్నిసొంతం చేసుకున్నాడు. లవ్‌ప్రీత్ స్నాచ్‌ రౌండ్‌లో 176 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 212 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి ఈ ఘనత సాధించాడు. ఈ కేటగిరీలో భారత అథ్లెట్ చూపించిన పట్టుదల క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

కాంస్య పతకం కోసం భారతీయుల మధ్య పోరు

మహిళల షాట్‌పుట్ పోటీల్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. కాంస్య పతకం కోసం ఇద్దరు భారత అథ్లెట్ల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. భారత అథ్లెట్ సీమా కలీరామ్నా తన అత్యుత్తమ త్రో 58.65 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమెతో పోటీపడిన మరో భారత అథ్లెట్ నిధి రాణి తన అత్యుత్తమ త్రో 57.10 మీటర్లతో నాలుగో స్థానానికి పరిమితమై పతకాన్ని కొద్దిలో చేజార్చుకుంది. కాగా, ఈ ఈవెంట్‌లో జమైకాకు చెందిన సమాంతా హాల్ 61.66 మీటర్ల త్రోతో స్వర్ణ పతకాన్ని సాధించింది.

పతకాల పట్టికలో భారత్ స్థానం ఎంత?

గురువారం నాటి ఆట ప్రారంభానికి ముందు భారత్ పతకాల పట్టికలో 8వ స్థానంలో ఉండేది. అయితే రెండు పతకాలు సాధించినప్పటికీ, మిగతా దేశాలు గోల్డ్ మెడల్స్ గెలవడంతో భారత్ ప్రస్తుతం 10వ స్థానానికి పడిపోయింది. సాధారణంగా విజేతల క్రమాన్ని సాధించిన స్వర్ణ పతకాల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు (3 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) ఉన్నాయి. ఈ టోర్నీలో భారత్‌కు అత్యధిక పతకాలు వెయిట్‌లిఫ్టింగ్ విభాగం నుంచే రావడం విశేషం. ఒక్క వెయిట్‌లిఫ్టింగ్‌లోనే భారత్ 1 గోల్డ్, 6 సిల్వర్, 1 బ్రాంజ్ సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *