Fish Shopping: మార్కెట్లో తాజా చేపలను గుర్తించడం ఎలా.. మోసపోకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

Fish Shopping: మార్కెట్లో తాజా చేపలను గుర్తించడం ఎలా.. మోసపోకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!


వర్షాకాలం మొదలైంది. ఈ చల్లని వాతావరణంలో , వర్షాలు పడే సమయంలో ఇంట్లో వేడివేడిగా ఘాటైన నాన్ వెజ్ తినాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో చేపల సాంబార్, ఎండు చేపల చట్నీ లేదా కరకరలాడే చేపల వేపుడు వంటి రకరకాల వంటకాలను తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. చేపలు మన శరీరానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు అనేక రకాల ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. అయితే, ఒకవేళ మనం తినే చేపలు తాజాగా లేకపోతే అవి ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. నిల్వ ఉన్న లేదా పాడైపోయిన పాత చేపలను తినడం వల్ల కడుపు ఉబ్బరం, వాంతులు, విరేచనాలు , తీవ్రమైన జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి.

ప్రస్తుత సీజన్‌లో చేపల వేటపై నిషేధం ఉండటం వల్ల మార్కెట్లో తాజా చేపలు దొరకడం చాలా గగనంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని చాలా మంది వ్యాపారులు పాత నిల్వ చేపలను కూడా తాజా చేపలంటూ చెప్పి వినియోగదారులను మోసం చేస్తుంటారు. కాబట్టి, మార్కెట్ కు వెళ్లినప్పుడు కేవలం ధర లేదా చేపల పరిమాణం (సైజ్) మీద మాత్రమే ఆధారపడకుండా కొన్ని సాధారణ శారీరక సంకేతాలను గమనించాలి. జాలర్లు , వంట నిపుణులు చెబుతున్న కొన్ని సులభమైన చిట్కాల ద్వారా మార్కెట్ లో మోసపోకుండా తాజా చేపలను ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.

తాజా చేపలను గుర్తించే 5 చిట్కాలు
మెరిసే కళ్లను గమనించడం: చేప తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి అత్యంత సులభమైన, మొదటి మార్గం దాని కళ్లను పరిశీలించడం. తాజా చేపల కళ్లు ఎల్లప్పుడూ చాలా స్పష్టంగా, కాంతితో మెరుస్తూ, కొద్దిగా పైకి ఉబ్బినట్లు ఉంటాయి. అదే చాలా కాలం క్రితం పట్టిన పాత చేపల కళ్లపై తెల్లటి మబ్బు లాంటి పొర ఏర్పడుతుంది. వాటి కళ్లు లోపలికి కుంగిపోయినట్లు, నిర్జీవంగా కనిపిస్తాయి. కాబట్టి కొనే ముందు మొదట చేప కళ్లను చూడటం ముఖ్యం.

సహజమైన వాసనను పసిగట్టడం: చేపలు కొనుగోలు చేసేటప్పుడు వాటి వాసనను ఖచ్చితంగా గమనించాలి. నది లేదా సముద్రం నుండి తెచ్చిన తాజా చేపలకు సహజమైన నీటి వాసన లేదా తేలికపాటి సముద్రపు వాసన ఉంటుంది. ఒకవేళ చేప నుండి విపరీతమైన కుళ్ళిన వాసన లేదా ఏదైనా వింత వాసన రావడం మొదలైతే అది అస్సలు తాజాగా లేదని అర్థం చేసుకోవాలి. చాలా దుకాణాలలో చేపలు తాజాగా కనిపించేలా చేయడానికి నిరంతరం చల్లటి నీటిని చల్లుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా వాసన చూసి నాణ్యతను పరీక్షించాలి.

చర్మం రంగు , మెరుపు: తాజా చేపలకు ఒక ప్రత్యేకమైన రూపం ఉంటుంది. వాటి చర్మం సహజమైన రంగుతో, స్పష్టమైన మెరుపును కలిగి ఉంటుంది. పాతపడిపోయిన చేపలు కాంతిహీనంగా, తెల్లగా మరిగిపోయినట్లు కనిపిస్తాయి. అలాగే చేప లోపలి భాగం లేదా మొప్పలను తెరిచి చూసినప్పుడు అవి ప్రకాశవంతమైన ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటేనే అది తాజా చేప అని నమ్మవచ్చు. ఒకవేళ ఆ భాగం గోధుమ రంగులోకి లేదా నలుపు రంగులోకి మారి కాంతిహీనంగా ఉంటే అవి చెడిపోయినవని గుర్తుంచుకోవాలి.

కండరాల గట్టిదనం: చేపల తాజాదనాన్ని తెలుసుకోవడానికి దాని శరీరంపై లేదా కండపై వేలితో మెల్లగా నొక్కి చూడాలి. తాజా చేప మాంసం ఎల్లప్పుడూ గట్టిగా ఉంటుంది. మనం వేలితో నొక్కినప్పుడు ఆ ప్రదేశం వెంటనే మునుపటి సాధారణ ఆకృతికి వచ్చేస్తుంది. ఒకవేళ పాడైపోయిన చేప అయితే ఆ కండ వదులుగా, మెత్తగా మారిపోతుంది. నొక్కినప్పుడు పడిన వేలి ముద్ర అలాగే ఎక్కువ సేపు ఉండిపోతే ఆ చేప అస్సలు తాజాది కాదని నిర్ధారించుకోవచ్చు.

చర్మం , జిగట స్వభావం: తాజా చేపల పై చర్మం లేదా పొలుసులు చాలా గట్టిగా అంటుకుని ఉంటాయి. అవి చేత్తో పట్టుకుంటే సులభంగా ఊడిపోవు. ఒకవేళ చర్మం దానంతట అదే వదులుగా ఊడిపోతుంటే అది కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందని సంకేతం. అలాగే తాజా చేప చర్మం కొద్దిగా తేమగా ఉంటుంది తప్ప జిగటగా ఉండదు. పాత చేపల శరీరంపై ఒక రకమైన జిగట ద్రవం ఏర్పడి చేతులకు అంటుకుంటుంది.

చాలా మంది ఐస్ లేదా మంచు ముక్కలలో ఉంచిన చేపలన్నీ తాజాగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఇది ఎల్లప్పుడూ నిజం కాదు. వ్యాపారులు పాత చేపలను కూడా ఐస్ బాక్సులలో పెట్టి భ్రమ కలిగిస్తుంటారు. కాబట్టి కేవలం మంచును మాత్రమే చూడకుండా పైన పేర్కొన్న కళ్లు, వాసన, రంగు , మాంసం నాణ్యత వంటి అన్ని విషయాలను తనిఖీ చేసి, చేపలను కొనాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *