Headlines

Hyderabad: 20 శాతం నీటిని తగ్గించుకోవాలని పౌరులకు వాటర్‌ బోర్డు సూచన


Hyderabad: 20 శాతం నీటిని తగ్గించుకోవాలని పౌరులకు వాటర్‌ బోర్డు సూచన

హైదరాబాద్‌ నీటి అవసరాలకు ప్రస్తుతానికి ఢోకా ఏమీ లేదు. కానీ త్వరలోనే నీటి కటకట తప్పదనే సంకేతాలు విన్పిస్తున్నాయి. డిసెంబర్‌ వరకు నీటి లభ్యత ఉంది. మున్ముందు నీటి గండాన్ని గట్టెక్కాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. రాబోయే ఎనిమిది నెలలు నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి వ్యక్తికి రోజుకు సుమారు 100 నుంచి 120 లీటర్ల నీటిని జల మండలి సప్లయ్‌ చేస్తోంది. ఇందులో కనీసం 20 శాతం వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచిస్తోంది. నీటి వృథా అరికట్టడం, వాడకంలో తగ్గుదల, పొదుపు చర్యలు పాటించాలని పిలుపునిస్తోంది.

హైదరాబాద్ నగరానికి నీటి సరఫరాలో మంజీరా, సింగూర్ జలాశయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సుమారు మూడు లక్షల నీటి కనెక్షన్లకు ఈ రెండు వనరుల నుంచే నీటి సరఫరా జరుగుతోంది. కొన్ని రోజుల్లోనే ఈ జలాశయాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశముంది. ఆయా ప్రాజెక్టుల నుంచి వచ్చే 100 MGDల నీటిని ప్రత్యామ్నాయంగా ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నది ప్రశ్నగా మారింది. భూగర్భ జలాలను ప్రత్యామ్నాయ వాటర్‌ బ్యాంకుగా పరిగణిస్తున్నారు అధికారులు. వాటిని విచ్చలవిడిగా వినియోగించకుండా సంరక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.

తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించకుండా చూడటమే లక్ష్యంగా వాటర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నిర్మాణ రంగంలో బోరు నీటికి బదులుగా STPల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా నిర్మాణ సంస్థలతో చర్చలు జరిపినట్లు వాటర్‌ బోర్డు MD వెల్లడించారు. ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లోనూ బోరు నీటికి బదులుగా ట్రీట్ చేసిన నీటిని ఉపయోగించాలని నిర్ణయించారు. STP నీటిని నిర్మాణాలు, పరిశ్రమలు, పార్కులు, సెంట్రల్ మీడియన్ల అవసరాలకు వినియోగించడం ద్వారా తాగునీటిపై ఒత్తిడిని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *