కావలసిన పదార్థాలు: 1 కప్పు మిల్ మేకర్, అర కప్పు బియ్యప్పిండి, అర కప్పు గోధుమపిండి, నీళ్లు, 1 మీడియం సైజు టమాటా, 2 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం ముక్క అల్లం,
4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, అర కప్పు ఉల్లిపాయ తరుగు, పావు కప్పు క్యారెట్ తురుము, టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, అర చెక్క నిమ్మరసం, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ కారం పొడి, అర టీస్పూన్ గరం మసాలా పొడి, అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు, వంట నూనె
తయారీ విధానం: ఒక బౌల్లో 1 కప్పు మిల్ మేకర్లను తీసుకుని బాగా మరిగే వేడినీళ్లు పోయాలి. 10 నిమిషాలు నాననివ్వాలి; ఆ తర్వాత చల్లటి నీళ్లలో వేసి చేత్తో గట్టిగా పిండుతూ నీరంతా తీసేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో ఈ మిల్ మేకర్లు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 1 కట్ చేసిన టమాటా వేయాలి. అవసరమైతే ఒకటి రెండు చెంచాల నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి.
బరకగా రుబ్బిన మిల్ మేకర్ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ కారం, అర టీస్పూన్ గరం మసాలా, అర చెక్క నిమ్మరసం పిండాలి. ఇందులో అర కప్పు ఉల్లిపాయ తరుగు, పావు కప్పు క్యారెట్ తురుము వేయాలి. బైండింగ్ కోసం అర కప్పు బియ్యప్పిండి, అర కప్పు గోధుమపిండి వేసి కలపాలి. ఇప్పుడు సరిగ్గా 1 కప్పు నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ పిండిని ఉండలు లేకుండా కలపాలి. చివరగా పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడంత వంట సోడా వేసి మరీ పల్చగా కాకుండా ఉత్తప్పం పిండిలాగా చిక్కగా కలుపుకోవాలి.
స్టవ్‌పై చిన్న అప్పం పాన్ లేదా సాధారణ దోశ పెనం పెట్టి 1 టీస్పూన్ నూనె వేయాలి. నూనెపై కొద్దిగా తెల్ల నువ్వులను సమానంగా చల్లాలి. ఇప్పుడు గరిటెడు పిండిని తీసుకుని మందపాటి చిన్న ఉత్తప్పంలా పరిచి.. పైభాగంలో కూడా మరికొన్ని నువ్వులు చల్లాలి. పైనుంచి మరో టీస్పూన్ నూనె వేసి మూతపెట్టి మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి 2 నిమిషాలు ఉడికించాలి.
అడుగు భాగం ఎర్రగా వేగి పైభాగం తడి ఆరిపోయాక.. స్పాచులాతో సున్నితంగా రెండో వైపుకు తిప్పుకోవాలి. మరో వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి లోపలి వరకు చక్కగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్‌పైనే కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే పద్ధతిలో మొత్తం పిండితో నాలుగు అప్పాలను కాల్చుకోవాలి. అంతే, నోరూరించే సూపర్ టేస్టీ 'హై-ప్రోటీన్ మిల్ మేకర్ అప్పం' సిద్ధం ! ఉదయాన్నే వేడివేడిగా పల్లి-కొబ్బరి చట్నీతో లేదా సాయంత్రం టమాటో సాస్‌తో నంజుకుని తింటుంటే నువ్వుల క్రంచీనెస్‌తో, మిల్ మేకర్-కూరగాయల కమ్మదనంతో అద్భుతమైన రుచినిస్తుంది!




