Headlines

Jabardasth: కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.. ఇప్పుడు అదే కడుపు నింపుతోంది: జబర్దస్త్ నటుడు


జబర్దస్త్‌ తో ఎంతో మందికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ షోలో సత్తా చాటిన ఎంతో మంది ఆర్టిస్టులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా రాణిస్తున్నారు. అదే సమయంలో ఒకప్పుడు ఇదే జబర్దస్త్ లో తమ కామెడీతో నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కొందరు నటులు.. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక వేర్వేరు పనులు చేసుకుంటున్నారు. కొందరు యూట్యూబ్ ఛానెళ్లు, ఈవెంట్లతో ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. మరికొందరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే మొన్నటివరకు ఇదే జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చకున్న ఒకరు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన ట్యాలెంట్ కు తగ్గట్టుగానే తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారుడిగా పని చేస్తున్నారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహన సదస్సులను తన ఆట, పాటల రూపంలో జనాలకు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? జబర్దస్త్ లో తాగుబోతు పాత్రలతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన రాజమౌళి. రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్ స్కిట్స్‌లో చేసిన ఆయన ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. దీనికి కారణం తాను ప్రభుత్వ ఉద్యోగం చేయడమేనని స్వయంగా రాజమౌళినే వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘ప్రభుత్వ ఉద్యోగం నాకు సెంటిమెంట్. తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పని చేసిన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ గారు ప్రకటించారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా కళాకారుడిని గుర్తించలేదు. కానీ ఉద్యోగభృతిని కల్పించి గౌరవస్థానాన్ని కల్పించిన ప్రజా ప్రతినిధి కేవలం ఒక్క కేసీఆర్ మాత్రమే. ఆయన వల్లే నాకు కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి ఒక్కరి కల. స్థిరమైన భృతి ఉంటది కదా అనే ఉద్దేశ్యంతో నా భార్య సలహా మేరకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరా. కరోనా టైంలో టీవీ షోలు, ఈవెంట్లు అన్నీ ఆగిపోయాయి. ఆ సమయంలో నాకున్న ప్రభుత్వ ఉద్యోగమే నన్ను కాపాడింది. నా కడుపు నింపింది. ప్రస్తుతం నేను తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారుడిగా పని చేస్తున్నాను. సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహన సదస్సులను పాట, ఆట రూపంలో ప్రజలకు తెలియజేస్తాం. సమాజానికి ఉపయోగపడే ఉద్యోగం మాది. ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ప్రజలకు తెలియజేస్తాం ‘ అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

తెలంగాణ సాంస్కృతిక శాఖలో ఉద్యోగిగా జబర్దస్త్ రాజమౌళి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *