Headlines

బ్యాగులతో హాయిగా వస్తున్నారు.. పోలీసులను చూసి లగెత్తారు.. అనుమానం వచ్చి పట్టుకుంటే..


పరవాడ (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా వరుస చోరీలతో ప్రజలను భయాందోళనలకు గురిచేసిన అంతర్‌జిల్లా దొంగల ముఠా గుట్టును జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా రట్టు చేశారు. పరవాడ డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్స్) మోహన రావు కేసు వివరాలను అధికారికంగా వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల సమష్టి కృషితో ఏకంగా 28 దొంగతనాల కేసులను ఛేదించి, సుమారు రూ.80.33 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కేసు నేపథ్యం – విచారణ:

గత అక్టోబర్ 6వ తేదీన మునగపాక పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కన్నం రమేశ్ అనే వ్యక్తి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విచారణ ముమ్మరం చేశారు.

సాంకేతిక ఆధారాలతో పట్టుబడ్డ నిందితులు:

ప్రత్యేక నిఘా బృందాలు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు వేగవంతం చేశాయి. అక్టోబర్ 18న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మునగపాక ఎస్సై పి.ప్రసాదరావు, సిబ్బంది అనకాపల్లి హైవే బస్ స్టాప్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఒకే ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అధికారులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను సోదా చేయగా భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి.

Anakapalli Theft Case

Anakapalli Theft Case

అరెస్టయిన నిందితుల వివరాలు..

  • చేపల ఆనంద్ (28) – గంగవరం, పెదగంట్యాడ మండలం, విశాఖపట్నం జిల్లా (గతంలో 17 కేసులు).
  • చిత్తరపు అభిషేక్ (23) – దొమ్మేటి వీధి, పెదగంట్యాడ మండలం, విశాఖపట్నం జిల్లా (గతంలో 13 కేసులు).
  • నిమ్మడా దిలీప్ (20) – బాలచెరువు వీధి, పెదగంట్యాడ మండలం, విశాఖపట్నం జిల్లా (గతంలో 1 కేసు).

ఈ ముగ్గురూ పాత నేరస్థులని, గతంలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన అనంతరం మళ్లీ నేరబాట పట్టారని పోలీసులు తెలిపారు. వీరు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా బీరువాలు పగలగొట్టడం, షాపుల షట్టర్లు తెరిచి సొత్తును దోచుకెళ్లడాన్ని అలవాటుగా మార్చుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ రూ.80,33,823  ఉంటుందని పోలీసులు తెలిపారు.

సుమారు 37.95 తులాల బంగారు ఆభరణాలు, 6.36 కిలోగ్రాముల వెండి.. నగదు రూ.30,000 స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుతో మునగపాక, నక్కపల్లి, రాంబిల్లి, పరవాడ, ఎలమంచిలి రూరల్, ఎలమంచిలి టౌన్, సబ్బవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 28 దొంగతనాల కేసుల సొత్తును రికవరీ చేశారు.

తక్కువ సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును విజయవంతంగా ఛేదించిన పరవాడ డీఎస్పీ బి.మోహన రావు, సీఐలు ధనుంజయరావు, భాస్కర రావు, నర్సింగరావు, మునగపాక ఎస్సై పి.ప్రసాదరావులతో పాటు కీలక పాత్ర పోషించిన కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *