విజయవాడ / వెంకటగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే.. మున్సిపల్ ఎన్నికల్లో రెండు చోట్ల అభ్యర్థుల గుర్తుల తారుమారు తీవ్ర గందరగోళానికి దారితీసింది. బ్యాలెట్ పేపర్లు, డిస్ప్లే బోర్డులపై గుర్తులు తారుమారవడంతో అభ్యర్థులు, ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. అభ్యర్థుల ఫిర్యాదుతో అధికారులు వెంటనే కొత్త బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేస్తున్నారు
విజయవాడ 55వ డివిజన్లో బ్యాలెట్ తారుమారు:
విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్ ముద్రణలో పొరపాటు జరగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బ్యాలెట్ పేపర్లో కాంగ్రెస్ అభ్యర్థికి వైఎస్సార్సీపీ (YSRCP) గుర్తును, అలాగే వైఎస్సార్సీపీ అభ్యర్థికి కాంగ్రెస్ గుర్తును ముద్రించారు. అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో అధికారులు తప్పును గుర్తించి వెంటనే పోలింగ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత కొత్త బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేసి సుమారు గంటసేపు ఆలస్యంగా పోలింగ్‌ను పునఃప్రారంభించారు. పోలింగ్‌కు ఎంత సేపు అయితే బ్రేక్ పడిందో.. అంత సమయం సాయంత్రం అదనంగా కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. అయితే అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కేవలం ముద్రణ సమయంలో దొర్లిన చిన్న పొరపాటుపై అనవసరంగా రాజకీయం చేయవద్దని టీడీపీ నేతలు హితవు పలికారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో డిస్ప్లే పేపర్ తారుమారు:
ఇదే తరహాలో తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలోనూ పొరపాటు వెలుగు చూసింది.
వెంకటగిరిలోని 35వ వార్డు పోలింగ్ బూత్ వెలుపల ఏర్పాటు చేసిన డిస్ప్లే పేపర్లో తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థి పేరు ఎదురుగా వైఎస్సార్సీపీ గుర్తును ముద్రించారు. పోలింగ్ ప్రారంభానికి ముందే అప్రమత్తమైన అధికారులు ఈ తప్పును గుర్తించి వెంటనే సరిచేశారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఎన్నికల నిర్వహణలో ఇలాంటి ముద్రణా లోపాలు పునరావృతం కాకుండా అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
Watch: ఇంత సడెన్ ఎంట్రీ ఇస్తే ఎట్లాగమ్మా.. కూతురిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి!