హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై రేవంత్ ఫోకస్.. అనుమతుల కోసం కేంద్రమంత్రి ఖట్టర్‌తో కీలక భేటీ!

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై రేవంత్ ఫోకస్.. అనుమతుల కోసం కేంద్రమంత్రి ఖట్టర్‌తో కీలక భేటీ!


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కీలక ప్రాజెక్టులకు కేంద్ర అనుమతుల అంశాలపై వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టుకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి మెట్రో ఫేజ్-2 అత్యంత అవసరమని వివరించారు. మొత్తం 76.4 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురాగలదని పేర్కొన్నారు. మెట్రో విస్తరణతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

పట్టణ వ్యవహారాల శాఖ సూచనల మేరకు ప్రాజెక్టు డీపీఆర్‌లో అవసరమైన మార్పులు చేసి ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో ఫేజ్-2కు సంబంధించిన అన్ని శాఖల అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు అమలైతే నగరంలో సుస్థిర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని, కాలుష్య నియంత్రణలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై సంబంధిత శాఖలతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సహా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *