Headlines

ఘరానా మోసం.. జ్యోతిష్యుడి నుంచి రూ.70 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.. ఎలానో తెలిస్తే..


గుంటూరు నగరంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఉద్యోగ నగర్‌కు చెందిన జ్యోతిష్యుడు జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రిని భయపెట్టి ఏకంగా రూ.70 లక్షలు కాజేశారు. ఏడాది క్రితమే ఈ మోసం జరిగినప్పటికీ, బాధితుడు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ మోసాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో బాధితుడు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని ఉద్యోగ నగర్‌కు చెందిన జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రికి జ్యోతిష్యుడిగా మంచి పేరుంది. ఆయనకు 2025 సెప్టెంబర్ 4న సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన పేరుతో బెంగళూరులో సిమ్ కార్డు తీసుకున్నారని, ఆ నంబర్ నుంచి ఓ పోలీసు అధికారి కుమార్తెకు అసభ్యకర సందేశాలు పంపించారని నిందితులు చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 17 కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ రామలింగేశ్వర శాస్త్రిని భయపెట్టారు. డిజిటల్ అరెస్ట్ తప్పదని బెదిరించారు. విచారణ కోసం తొలుత బెంగళూరుకు, ఆ తర్వాత ఢిల్లీకి రావాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మరో కేసులోనూ ఇరికిస్తామంటూ..

ఇదే సమయంలో సదాఖాన్ అనే వ్యక్తికి సంబంధించిన ఆస్తి విక్రయ వ్యవహారంలో కమీషన్ తీసుకున్న అంశంపై కూడా కేసు నమోదైనట్లు సైబర్ నేరగాళ్లు చెప్పుకొచ్చారు. ఒకటి కాదు.. రెండు కేసుల్లో ఇరుక్కున్నానని భావించిన రామలింగేశ్వర శాస్త్రి వారి మాటలను నమ్మారు. విచారణ నుంచి తప్పించుకోవాలంటే ఆర్‌బీఐ ద్వారా తన బ్యాంకు ఖాతాలను పరిశీలన చేయించుకోవాలని నిందితులు సూచించారు. ఇందుకోసం వివిధ బ్యాంకుల ఖాతాల నుంచి డబ్బులు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో బాధితుడు వారు చెప్పినట్లుగా డబ్బులు పంపించేందుకు అంగీకరించారు.

ఐదు విడతల్లో రూ.70 లక్షలు బదిలీ

2025 సెప్టెంబర్ 8 నుంచి అక్టోబర్ 14 మధ్య ఐదు విడతల్లో రామలింగేశ్వర శాస్త్రి మొత్తం రూ.70 లక్షలు బదిలీ చేశారు. యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ ఖాతాల నుంచి ఈ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు పంపించారు. అయితే, డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. నిందితులను సంప్రదించేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించారు.

ఏడాది తర్వాత పోలీసులకు ఫిర్యాదు

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తుండటంతో రామలింగేశ్వర శాస్త్రి తాజాగా పోలీసులను ఆశ్రయించారు. పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించి, డబ్బులు ఏయే ఖాతాలకు బదిలీ అయ్యాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *