Headlines

Life Lesson: మీ జీవితాన్ని మార్చే గొప్ప పాఠం.. నాలుగు గుర్రాల కథ!


ఒక రాజ్యంలో ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర నాలుగు అందమైన గుర్రాలు ఉండేవి. అయితే అవి చాలా మొండివి, శిక్షణ లేనివి. రాజుకు ఆ గుర్రాలంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా వాటికి మంచి శిక్షణ ఇప్పించాలని ఆయన కోరుకునేవాడు. చాలామంది శిక్షకులు ఆ గుర్రాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరైనా వాటిపై ఎక్కి కూర్చుంటే వెంటనే కింద పడేసేవి. పైగా రాజుకు ఆ గుర్రాలంటే ఎంతో ఇష్టం ఉండటంతో వాటిని కొట్టడానికి, దండించడానికి ఆయన ఎవరినీ అనుమతించేవాడు కాదు. దీంతో శిక్షకుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి రాజు ఒక ప్రకటన చేశాడు. ‘ఈ నాలుగు గుర్రాలకు ఎలాంటి శిక్ష లేకుండా విజయవంతంగా శిక్షణ ఇచ్చే వ్యక్తికి లక్ష బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను.’ ఈ ప్రకటన విని చాలామంది వచ్చారు. కానీ ఎవరూ గుర్రాలకు శిక్షణ ఇవ్వలేకపోయారు.

ఒకరోజు ఒక యువకుడు రాజు ఆస్థానానికి వచ్చాడు. ‘మహారాజా! మీ నాలుగు గుర్రాలకు నేను శిక్షణ ఇవ్వగలను. అయితే అందుకు మీరు రెండు షరతులను అంగీకరించాలి’ అని చెప్పాడు. రాజు షరతులు చెప్పమన్నాడు. ‘మొదటిది.. నాకు ఒక సంవత్సరం సమయం కావాలి. రెండోది.. ఈ గుర్రాలతో కలిసి ఉండటానికి, తినటానికి, నిద్రించటానికి నాకు అనుమతి ఇవ్వాలి. వాటికి ఆహారం ఇవ్వడం, నీళ్లు పెట్టడం, సంరక్షించడం వంటి పూర్తి బాధ్యతను కూడా నాకు అప్పగించాలి’ అని యువకుడు చెప్పాడు. రాజు కొద్దిసేపు ఆలోచించి ఆ షరతులకు అంగీకరించాడు. మరుసటి రోజు యువ శిక్షకుడు గుర్రాలను ఒక పెద్ద మైదానంలోకి తీసుకెళ్లాడు. వాటిని ఎక్కడా కట్టకుండా స్వేచ్ఛగా వదిలేశాడు. గుర్రాలు మైదానంలో అటూ ఇటూ పరిగెత్తాయి. అయితే శిక్షకుడు కూడా వాటి వెనుక పరిగెత్తడం ప్రారంభించాడు. కొంతసేపటి తర్వాత వాటికి ఆహారం ఇచ్చాడు. నీళ్లు పెట్టాడు. వాటితోనే కొంత సమయం గడిపాడు. రాత్రి కూడా వాటి దగ్గరే నిద్రపోయాడు. ఇలా ప్రతిరోజూ చేయడం ప్రారంభించాడు. ఉదయం గుర్రాలతో కలిసి మైదానంలో పరిగెత్తేవాడు. వాటికి ఆహారం పెట్టేవాడు. శుభ్రం చేసేవాడు. వాటితో ఆడుకునేవాడు. వాటి దగ్గరే నిద్రించేవాడు. కొద్దికొద్దిగా గుర్రాలకు అతనిపై నమ్మకం పెరిగింది. శిక్షకుడు వాటిని బలవంతం చేయలేదు.. వాటితో స్నేహం చేశాడు.

ఆరు నెలలు గడిచాయి. ఒకరోజు రాజు గుర్రాల శిక్షణ ఎలా జరుగుతోందో చూడటానికి వచ్చాడు. మైదానంలో యువ శిక్షకుడు పరిగెడుతుంటే నాలుగు గుర్రాలు అతని వెనుకే పరిగెత్తడం చూసి రాజు ఎంతో సంతోషించాడు. చూస్తుండగానే ఒక సంవత్సరం పూర్తయింది. గుర్రాలకు శిక్షణ పూర్తయిందని రాజుకు సమాచారం అందింది. రాజు ఆసక్తిగా మైదానానికి చేరుకున్నాడు. యువ శిక్షకుడు ఒక్కొక్క గుర్రంపై ఎక్కి స్వారీ చేశాడు. ఈసారి గుర్రాలు అతన్ని కింద పడేయలేదు. అతను ఎటు వెళ్తే అటే వెళ్లాయి. అతని మాటలను పాటించాయి. రాజు ఆశ్చర్యపోయాడు. ‘ఎంతోమంది ప్రయత్నించినా ఈ గుర్రాలకు శిక్షణ ఇవ్వలేకపోయారు. నువ్వు మాత్రం ఎలా సాధించావు?’ అని అడిగాడు. యువ శిక్షకుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు.. ‘మహారాజా! నేను వాటిని బలవంతం చేయలేదు. వాటికి స్వేచ్ఛ ఇచ్చాను. వాటితో కలిసి జీవించాను. వాటికి ఆహారం ఇచ్చాను. వాటిని ప్రేమించాను. దాంతో అవి నన్ను తమ స్నేహితుడిగా భావించాయి. మొదట నేను పరిగెత్తినప్పుడు అవి కూడా నా వెంట పరిగెత్తాయి. కొంతకాలం తర్వాత వాటిపై కూర్చోవడానికి ప్రయత్నించాను. మొదట నన్ను కింద పడేశాయి. కానీ నెమ్మదిగా వాటికి అలవాటు అయింది. చివరికి నా మాట వినడం ప్రారంభించాయి. ఈరోజు మీరు చూస్తున్న ఫలితం అదే.’ రాజు ఎంతో సంతోషించాడు. యువకుడికి లక్ష బంగారు నాణాలు బహుమతిగా ఇవ్వడమే కాకుండా, ఆ గుర్రాల సంరక్షణ బాధ్యతను శాశ్వతంగా అప్పగించాడు.

ఇవి కూడా చదవండి



ఈ కథలో మనకు ఉన్న నాలుగు గుర్రాలు ఏవి?

ఇది కేవలం గుర్రాల కథ కాదు. మనిషి జీవితానికి సంబంధించిన గొప్ప సందేశం ఇందులో ఉంది. ప్రతి మనిషి మనసులో కూడా నాలుగు “అశిక్షిత గుర్రాలు” ఉంటాయని ఈ కథ మనకు చెబుతుంది.

  • చింత – ఆందోళన
  • కోపం – ఆవేశం
  • అహంకారం – గర్వం
  • అత్యాశ – దురాశ

ఈ నాలుగు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి.

అయితే ఈ గుర్రాలకు శిక్షణ ఇచ్చే శిక్షకుడు ఎవరు?

మన బుద్ధి.. మన ఆలోచనలు.. ఒక్క మాటలో చెప్పాలంటే మనమే.

చింత అనే గుర్రం

చింతించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. సమస్య గురించి పదేపదే ఆలోచిస్తూ బాధపడటం కంటే, సమస్యకు పరిష్కారం ఎలా కనుగొనాలనే దానిపై దృష్టి పెట్టాలి. చింత సమస్యను పెంచుతుంది.. ఆలోచన పరిష్కారాన్ని చూపిస్తుంది. కాబట్టి సానుకూల ఆలోచనలతో చింత అనే గుర్రాన్ని అదుపులో పెట్టుకోవాలి.

కోపం అనే గుర్రం

కోపం వల్ల ఎదుటివారికి నష్టం కలుగుతుందో లేదో తెలియదు కానీ, మనకు మాత్రం తప్పకుండా నష్టం కలగవచ్చు. అయితే కోపం రావడం సహజం. కొన్ని సందర్భాల్లో అన్యాయం జరిగినప్పుడు లేదా మన హక్కులకు భంగం కలిగినప్పుడు మన అసంతృప్తిని వ్యక్తం చేయాల్సి రావచ్చు. కానీ ఎప్పుడు కోపాన్ని వ్యక్తం చేయాలి? ఎంతవరకు చేయాలి? ఎక్కడ ఆపాలి? అన్నది తెలుసుకోవడం ముఖ్యం. అందుకే కోపాన్ని అణచివేయడం మాత్రమే కాదు.. దాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి.

అహంకారం అనే గుర్రం

‘ఈ పని నేను చేయగలను’ అనుకోవడం ఆత్మవిశ్వాసం. ‘ఈ పని నేను మాత్రమే చేయగలను’ అనుకోవడం అహంకారం. మనకు ఆత్మవిశ్వాసం అవసరం. కానీ అహంకారం మాత్రం మన సంబంధాలను, మన ఎదుగుదలను దెబ్బతీయవచ్చు. కాబట్టి మన విజయాలను గౌరవించుకుంటూనే ఇతరులను కూడా గౌరవించడం నేర్చుకోవాలి.

అత్యాశ అనే గుర్రం

ముందుకు వెళ్లాలనే కోరిక మంచిదే. ఎక్కువ జ్ఞానం సంపాదించాలనే తపన కూడా మంచిదే. కష్టపడి, నిజాయితీగా డబ్బు సంపాదించాలనే లక్ష్యం కూడా తప్పు కాదు. కానీ త్వరగా డబ్బు సంపాదించాలి, అందుకోసం తప్పు మార్గంలో వెళ్లినా పర్వాలేదు అనే ఆలోచన దురాశగా మారుతుంది. కాబట్టి అవసరం, ఆశ, అత్యాశ మధ్య తేడాను గుర్తించాలి.

నీతి

నాలుగు గుర్రాలను యువ శిక్షకుడు బలవంతంగా మార్చలేదు. వాటితో స్నేహం చేశాడు. వాటి స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. సమయం ఇచ్చాడు. చివరికి వాటిని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. అదే విధంగా మనలోని చింత, కోపం, అహంకారం, అత్యాశలను ఒక్కరోజులో పూర్తిగా మార్చలేం. కానీ ప్రతిరోజూ కొద్దికొద్దిగా మన ఆలోచనలను మార్చుకుంటూ, మన అలవాట్లను గమనిస్తూ, సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్తే మనలోని ఈ నాలుగు గుర్రాలను కూడా అదుపులో పెట్టుకోవచ్చు. మనసును జయించగలిగిన వ్యక్తి తన జీవితాన్ని కూడా సరైన దారిలో నడిపించగలడు. కాబట్టి మీలోని నాలుగు గుర్రాలను గుర్తించండి.. వాటితో పోరాడకండి.. వాటికి సరైన శిక్షణ ఇవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *