Headlines

ఎప్పుడూ మరింత మెరుగ్గా మారాలనుకుంటున్నారా? ఈ వైరల్‌ పోస్ట్‌ మీరు చదవాల్సిందే!


జీవితంలో ఎదగాలని, మరింత విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం కొత్త విషయాలు నేర్చుకోవడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం, తమను తాము మెరుగుపరుచుకోవడం సహజమే. అయితే భవిష్యత్తులో ఎలా ఉండాలనే ఆలోచనలో.. ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోతే? ఇదే విషయాన్ని ఎక్స్‌ యూజర్‌ సిమ్రాన్‌ సచ్‌దేవా తన తాజా పోస్ట్‌ ద్వారా గుర్తుచేశారు. సచ్‌దేవా తన పోస్ట్‌లో.. ‘మీరు కావాలనుకున్న వ్యక్తిగా మారడానికి చాలా సమయం వెచ్చిస్తారు. కానీ ప్రస్తుతం మీరున్న జీవితాన్ని గడపడం మర్చిపోతారు’ అని పేర్కొన్నారు.

మరింత తెలివైనవారిగా, విజయవంతమైనవారిగా, ఆకర్షణీయంగా, క్రమశిక్షణతో, ఆసక్తికరంగా మారాలని చాలామంది నిరంతరం ప్రయత్నిస్తుంటారని ఆమె అన్నారు. ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుని జీవితాన్ని ఆస్వాదించగలమని మనకు మనమే చెప్పుకుంటామని వివరించారు. కానీ ఒక లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే మరో లక్ష్యం మన ముందుకు వస్తుందని, ఏదో ఒక విషయంలో మనకంటే మెరుగ్గా ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఉంటారని సచ్‌దేవా గుర్తుచేశారు. దీంతో ‘నేను ఇంకా సరిపోలేదు’ అనే భావన నుంచి బయటపడటం కష్టమవుతుందని పేర్కొన్నారు.

గమ్యం కంటే ప్రయాణం కూడా ముఖ్యమే..

జీవితాన్ని నిరంతరం మన సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంగా మార్చుకోవద్దని సచ్‌దేవా సూచించారు. అదే సమయంలో, ఆశయాలను వదులుకోవాలని కూడా ఆమె చెప్పలేదు. ‘ఈరోజు మీరు ఎలా ఉన్నారో దానితో సంతోషంగా ఉంటూనే.. మీరు ఎలా మారాలనుకుంటున్నారో దానిపై ఆశయాన్ని ఎలా కొనసాగించాలి?’ అనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం ప్రస్తుతం మనం తక్కువగా ఉన్నామని భావించాల్సిన అవసరం లేదని, ఇతరుల విజయాలను చూసి మనల్ని మనం చిన్నచూపు చూడకుండా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె వివరించారు. అలాగే తదుపరి లక్ష్యం కోసం పరుగెత్తే ముందు ఇప్పటివరకు సాధించిన పురోగతిని గుర్తించాలని సూచించారు. జీవితం నిరంతరం మారుతూ, అభివృద్ధి చెందే ప్రక్రియ అని అంగీకరించడమే ముఖ్యమని సచ్‌దేవా తెలిపారు. భవిష్యత్తులో ఒకరోజు మనం కోరుకున్న వ్యక్తిగా మారిన తర్వాతే జీవితాన్ని ఆస్వాదించాలనుకోవడం కంటే.. ఆ వ్యక్తిగా మారే ప్రయాణాన్ని కూడా ఆస్వాదించడం నేర్చుకోవాలని ఆమె సూచించారు.

ఇవి కూడా చదవండి



సోషల్ మీడియాలో స్పందనలు

సచ్‌దేవా పోస్ట్‌ సోషల్ మీడియాలో పలువురి దృష్టిని ఆకర్షించింది. ఆశయం కలిగి ఉండటం అంటే ప్రస్తుతం ఉన్న మనం సరిపోమని భావించడం కాదని ఒక యూజర్‌ వ్యాఖ్యానించారు. మరో యూజర్‌ దీనిని ‘ది అరైవల్ ఫాలసీ (The Arrival Fallacy)’గా అభివర్ణించారు. మొత్తంగా, ఎదగాలనే తపన అవసరమే అయినా.. రేపటి కోసం పరుగెత్తుతూ నేటిని కోల్పోవద్దనే సందేశాన్ని సిమ్రాన్‌ సచ్‌దేవా పోస్ట్‌ గుర్తుచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *