Headlines

Singer Janaki: ‘కన్నీళ్లతో మా బాధను ముడి పెట్టొద్దు’.. ట్రోల్స్‌పై జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్

Singer Janaki: ‘కన్నీళ్లతో మా బాధను ముడి పెట్టొద్దు’.. ట్రోల్స్‌పై జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్


ప్రముఖ గాయని ఎస్‌.జానకి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సంగీత ప్రియుల అశ్రు నయనాల మధ్య ఆదివారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి జానకి మనవరాలు అప్సర విద్యులపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. జానకి భౌతికకాయం వద్ద అప్సర ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఆమె ముఖంలో కనీసం బాధలేదని, కన్నీళ్లు కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. తాజాగా తనపై జరుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన అప్సర సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఈ ప్రపంచంలో మా నానమ్మ(జానకి)కు మా అక్క వర్ష అంటే ప్రాణం. వాళ్లిద్దరూ ఒకేలా ఉండేవారు. పోలికల దగ్గర నుంచి మాట్లాడడం వరకూ ఒకరి కోసం ఒకరు పుట్టారా అనేలా ఉండేవారు. నిజానికి మా నానమ్మ అంతక్రియలు మా అక్క వర్ష నే నిర్వహించాలి. కానీ, ఆమె 2023లోనే కన్నుమూసింది. ఆ దుఃఖం నుంచి మేం ఇప్పటికీ కోలుకోలేదు. వర్ష చేయాల్సిన బాధ్యతలు నేను ఎంత బాధతో నిర్వహించానో నా మనసుకు మాత్రమే తెలుసు. మాకెంతో ఇష్టమైన అక్క, నానమ్మ మమ్మల్ని వదిలి వెళ్లారనే బాధ కంటే.. వారిద్దరూ స్వర్గంలో ఒకరినొకరు కలుసుకుని ఉంటారనే ఆలోచనే నాకు ఇప్పుడు పెద్ద ఓదార్పునిస్తోంది’

‘ఒక మనిషిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం కొన్ని రోజుల్లో మాయమైపోయేది కాదు. అది జీవితాంతం ఒక గుండె బరువుగా మారి మారి మనసుల్ని మెలిపెడుతూనే ఉంటుంది. నేను కన్నీరు పెట్టుకోలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. దయచేసి కళ్లకు కనిపించని కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు. మరణాన్ని ఒక లోతైన ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకోవాలని నానమ్మ ఎప్పుడూ చెబుతుండేది. ఆమె చెప్పిన మాటలు నన్ను ఎంతో బలంగా చేశాయి. అసలు ఎదుటి వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియని వారు.. ఇష్టం వచ్చినట్లు అభిప్రాయాలు ఏర్పరచుకోవడాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది జానకి మనవరాలు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి



జానకి మనవరాలి పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *