Headlines

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. డిసెంబర్‌లో పనులు ప్రారంభం!


తెలంగాణలో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిపుణుల సూచనలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల మార్గదర్శకాల మేరకే పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. బ్యారేజీల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని తేల్చిచెప్పారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

మూడు బ్యారేజీల పునరుద్ధరణకు మొత్తం రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెలాఖరులోగా తుది అనుమతులు పొందాలని, డిసెంబర్‌లోగా పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. నిర్మాణంలో జరిగిన లోపాల మరమ్మతుల ఖర్చును సంబంధిత నిర్మాణ సంస్థలే భరించేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అదనపు పనులకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

మేడిగడ్డ నీటి వినియోగంపై కీలక చర్చ

మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని లిఫ్ట్ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయడం సాంకేతికంగా సాధ్యం కాదని అధికారులు వివరించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే గేట్లు మూసివేయవద్దని గతంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు.

దిగువ గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వం ఆరా

దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా దిగువ గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత మూడేళ్లలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా సగటున 18.13 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సగటు 9.57 టీఎంసీలుగా ఉండేదని, ప్రస్తుతం 89 శాతం అధికంగా నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. అక్టోబర్ నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టు ద్వారా 8.10 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా మొత్తం 24.81 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు సాగు, తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రాణహిత ప్రాజెక్టుపై సీఎం వ్యాఖ్యలు

ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉంటే ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తేవి కావని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాణహిత జలాలను తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని సీఎం వ్యాఖ్యానించారు.

మొత్తంగా కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, భద్రత, గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. డిసెంబర్‌లో పనులు ప్రారంభించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Watch: ఇంత సడెన్ ఎంట్రీ ఇస్తే ఎట్లాగమ్మా.. కూతురిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *