Fact Check: ప్రధాని మోదీ పేరుతో ‘ఉచిత సైకిల్’ వీడియో వైరల్.. నమ్మితే నిలువునా మునుగుతారు!

Fact Check: ప్రధాని మోదీ పేరుతో ‘ఉచిత సైకిల్’ వీడియో వైరల్.. నమ్మితే నిలువునా మునుగుతారు!


ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేస్తోందంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (PIB) రంగంలోకి దిగి అసలు రూపాన్ని బట్టబయలు చేసింది.

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పరిశోధనలో ఈ వీడియో పూర్తిగా నకిలీదని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి ప్రధాని మోదీ వాయిస్, విజువల్స్‌ను మార్చేసి ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారని అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం “ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్ల పథకం” అనేదేదీ ప్రకటించలేదని పీఐబీ అధికారికంగా వెల్లడించింది.

ఇలాంటి నకిలీ లింక్‌లు, వీడియోల వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉచిత పథకాల పేరుతో ప్రజలను ఆకర్షించి, వారి ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్ల వంటి వ్యక్తిగత వివరాలను దొంగిలించేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతాయని పేర్కొన్నారు.

ఎలాంటి ధృవీకరణ లేని సోషల్ మీడియా పోస్టులను, ఫార్వార్డ్ మెసేజ్‌లను బ్లైండ్‌గా నమ్మవద్దు. ప్రభుత్వం అందించే ఏ పథకానికైనా దరఖాస్తు చేసుకునే ముందు, అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను (‘.gov.in’) మాత్రమే సంప్రదించి, వాస్తవాలను సరిచూసుకోవాలని పౌరులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. నకిలీ వార్తలను ఇతరులకు షేర్ చేయకుండా అడ్డుకోవాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *