Petrol Prices: ప్రతీ రూ.5 ఖర్చులో రూ.1 పెట్రోల్‌పైనే.. బయటకొచ్చిన ఖంగుతినే లెక్కలు..

Petrol Prices: ప్రతీ రూ.5 ఖర్చులో రూ.1 పెట్రోల్‌పైనే.. బయటకొచ్చిన ఖంగుతినే లెక్కలు..


కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్ యుద్దం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం, హర్ముజ్ జలసంధి బంద్ కావడం వంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావంతో అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగ్గా.. భారత్‌లో కూడా అదే బాట పట్టాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల ఆయిల్ కంపెనీలపై భారం పడుతుంది. దీంతో ఆయిల్ కంపెనీల నష్టాలను పూడ్చేందుకు కేంద్రం గత నెలలో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.7.5 మేర పెంచాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.110 వరకు చేరుకోగా.. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువ పలుకుతున్నాయి.

పెట్రోల్‌పై ఎక్కవ ఖర్చు

అయితే ఈ క్రమంలో ఖంగుతినే ఒక వార్త బయటకొచ్చింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు ఇంధనంపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. తాము సంపాదించే ఆదాయంలో అధిక భాగాన్ని పెట్రోల్, డీజిల్‌పై ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ప్రతీ వ్యక్తి ప్రతీ నెలా సగటున 40 లీటర్ల పెట్రోల్ కొనేందుకు తన ఆదాయంలో 20.3 శాతం డబ్బులు ఖర్చు చేస్తున్నాడట. అంటే ఖర్చు చేసే ప్రతీ రూ.5లో ఒక రూపాయి పెట్రోల్‌పై ఖర్చువుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇంధన ధరలు పెరిగితే అది ఖచ్చితంపై ప్రజలపై భారం పడుతుందని చెప్పవచ్చు. అమెరికా, యూకే, రష్యా, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలతో పోలిస్తే భారతీయులు ఇంధనపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారట.

మరో రూ.5 పెరుగుతాయా..?

అమెరికాలో ప్రజలు తమ ఆదాయంలో 0.7 శాతం పెట్రోల్‌పై ఖర్చు చేస్తుండగా.. యూకేలో 1.9 శాతం, రష్యాలో 3.1 శాతం, చైనాలో 4.8 శాతం, బ్రెజిల్‌లో 6.1 శాతం, శ్రీలంకలో 15.6 శాతం ఖర్చు చేస్తున్నారు. అదే ఇండియాలో 20.30 శాతం ఖర్చు చేస్తున్నారు. ఇండియాలో ఒక వ్యక్తి సగటున రోజుకు 7.70 డాలర్లు సంపాదిస్తుండగా.. అమెరికాలో 33.6, రష్యాలో 6.6, యూకేలో 21.7, జర్మనీలో 23.2, ఫ్రాన్స్‌లో 18.8, జపాన్‌లో 12.7, జైనాలో 5.3, బ్రెజిల్‌లో 4.4 డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఇతర అభివృద్ది చెందిన దేశాల్లో కంటే భారత్‌లో తలసరి ఆదాయం తక్కువగా ఉంది. సగటు వ్యక్తి ఆదాయంతో చూస్తే పెట్రోల్ ధర చాలా ఖరీదైనదిగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ గణాంకాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. అయితే త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. మరో రూ.5 మేర పెరగవచ్చనే నివేదికలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో ఇంకా స్థిరత్వం ఏర్పడలేదు. దీంతో ఆయిల్ కంపెనీలు ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *